స్థానిక మంత్రి పోలీసులపై తీసుకొని వచ్చిన ఒత్తిడి కారణంగా సాయి గణేష్ వాంగ్మూలం రికార్డ్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఖమ్మం సంఘటన అందుకు అద్దం పడుతుందని, తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు.
రైతు బంధు నుంచి దళిత బంధు టీఆర్‌ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడి కారణంగా తెలంగాణ రాలేదని, 12 వందల మంది ఆత్మహత్యల కారణంగా తెలంగాణ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 12 వందల మంది ఆత్మబలిదానాలు వృధా పోవని, గత రెండు ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎలా గెలిపించారో అలాగే ఒడిస్తారని ఆయన హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగంపై బీజేపీ పోరాటం చేస్తుందని, టీఆర్‌ఎస్ అవినీతి అరాచక పాలనపై బీజేపీ పోరాటం చేస్తుంటే తెలంగాణ సెంటిమెంట్ కు లింక్ పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా ? అని ఆయన సవాల్ విసిరారు. కరోనా కారణంగా వ్యాక్సిన్ కానీ, మీరు తెస్తున్న 90 శాతం అప్పులు రాష్టానికి కేంద్రం ఇస్తుందని, కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు బుద్ధి చెపుతారన్నారు.
ఎన్ని వేల కోట్ల అక్రమ డబ్బు ఖర్చు పెట్టిన టీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయమని, కేసీఆర్ నిజాం తరహా పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీఆర్‌ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని, బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మబలి దానం వృధా పోదన్నారు. సచివాలయం లేని తెలంగాణ, సచివాలయంకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కేసీఆర్ కుటుంబ పాలనకు అతీతంగా ఒక నీతి వంత పాలన తెస్తామన్నారు.