ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేని సమస్యను వున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని కేందంమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పాత అగ్రిమెంట్ ప్రకారం.. కేంద్రానికి సరఫరా చేయాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా సప్లయ్ చేయలేదని ఆయన తెలిపారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్ రైసును రాష్ట్రం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారమే ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్ రైసును ఇంకా ఎఫ్‌సీఐకి పంపలేదు.
ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రైతు దీక్షలు కాదు. రాజకీయ దీక్షలు చేశారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో దీక్ష చేసి లబ్ది పొందాలనుకున్నారని, తెలంగాణ ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరదించాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రజలు మీ డ్రామాలకు తెర దించుతారని ఆయన హెచ్చరించారు.