Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని యూరియా సరఫరా కోసం విజ్ఞప్తి చేస్తున్నామని, ఢిల్లీకి వెళ్లి నేరుగా అధికారులను కలిసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లభించడం లేదని వాపోయారు. ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం ఆ మొత్తాన్ని అందించలేదని ఆయన అన్నారు. మే నెలలో కూడా హామీ ఇచ్చిన మొత్తాన్ని సరఫరా చేయకపోగా, జూన్‌లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికకు బదులుగా కేవలం 98,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించారని ఆయన వివరించారు. జూలై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికలో 6.60 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Double Bedroom Scam: డబుల్ బెడ్‌రూమ్ స్కామ్‌లో మోసపోయిన 83 మంది.. ఎవరు చేశారో తెలుసా?
“కేంద్రం చెప్పేది ఒకటి, పంపించేది దానికంటే చాలా తక్కువగా ఉంది. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొరత వల్ల ఖరీఫ్ సీజన్‌లో పంటల ఉత్పత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉంది,” అని తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, 2.37 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాబోయే నాలుగైదు రోజుల్లో సరఫరా చేయాలని కోరారు. మంత్రి తుమ్మల బీజేపీ నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు. “రైతుల మీద అవగాహన ఉంటే, కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి యూరియా సరఫరా జరిగేలా చేయండి. రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేయడం మంచిది కాదు. మీకు పలుకుబడి ఉన్న మేరకు కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతుల బాధలు తీర్చండి,” అని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.
