Double Bedroom Scam Exposed in Kuthbullapur: ప్రభుత్వ పథకం ‘డబుల్ బెడ్‌రూమ్’ హౌసింగ్ పేరున రాజకీయ నాయకుల అనుచరులు, అధికారులు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నేను పలానా ఎమ్మెల్యే పీఏను, నాకు ఆ మంత్రి బాగా తెలుసు, నేను ప్రభుత్వ ఆఫీసులోనే పనిచేస్తాను అని చెప్పి.. డబుల్ బెడ్‌రూమ్ ఇప్పించే బాధ్యత తమది అంటూ పేద ప్రజల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడిన వారిని ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కుత్బుల్లాపూర్‌లో మరో స్కామ్ బట్టబయలైంది.
కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ రాజకీయ నాయకుల అనుచరులు డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బు వసూల్ చేసి సామాన్య జనాలను మోసం చేశారు. శ్రీధర్ అనే వ్యక్తి బీఆర్‌ఎస్ నేతలతో ఉన్న ఫోటోలు చూపించి పేద వారిని టార్గెట్ చేశాడు. ఖతా, రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట భారీగా డబ్బులు వసూలు చేశాడు. నకిలీ అలాట్‌మెంట్ లేఖలు ఫోటోషాప్‌లో తయారు చేశాడు. జియో ఉద్యోగి ప్రదీప్ ప్రసాద్ నకిలీ లేఖలు ఇచ్చి శ్రీధర్‌కు సహకారం అందించాడు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు గోదావరి హోమ్స్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, స్కానర్లు సీజ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Also Read: Kondapur Rave Party: కొంపలో కుంపటి.. రేవ్ పార్టీలో 2 కేజీల గంజాయి సీజ్, 9 మంది అరెస్ట్!
కుత్బుల్లాపూర్ మండలం రెడ్డినగర్ కాలనీకి చెందిన బొమ్మిడిశెట్టి హరిబాబు కూడా మూడు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడిగా హరిబాబు పని చేశాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తానని రూ.లక్ష కమీషన్ తీసుకున్నాడు. జీడిమెట్లకు చెందిన తైలం రమేశ్ ద్వారా హరిబాబు మోసం బయటపడింది. హరిబాబు మరో 82 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు 8 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.