NTV Telugu Site icon

Medipalli Satyam: అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు..

Medipalli

Medipalli

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు. 10 ఏళ్లలో 30 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. గత ఏడాది అకాల వర్షాలతో చొప్పదండి నియోజక వర్గంలో పంటలు దెబ్బతింటే కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ కి కేసీఆర్ వచ్చి ఎకరానికి 10 వేల చొప్పున హైదరాబాద్ వెళ్ళే లోపు ఇస్తా అని చెప్పాడు, ఒక్క రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు.

Read Also: Delhi High Court: భర్త తప్పులేకుండా పదేపదే భార్య అత్తింటి నుంచి వెళ్లిపోవడం క్రూరత్వమే..

ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ వస్తున్నాడని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. మిడ్ మానేరు నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు. రాజన్న గుడి సాక్షిగా 5 లక్షల 4 వేలు ఇస్తా అన్నావ్ ఇవ్వలేదని తెలిపారు. విత్తనాల రాయితీ, ఎరువుల మీద రాయితీ లేకుండా చేశావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను స్వేచ్చగా తిరిగే హక్కు కల్పించాడు.. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ లు, నిర్బంధాలు చేశాడని మండిపడ్డారు. తాము ఆహ్వానం పలుకుతున్నాం, రైతులకు క్షమాపణ చెప్పాలని కోరారు. నీవు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు బి ఫామ్ ఇస్తే వద్దు అంటున్నారని.. ప్రతిపక్ష హోదాలో బుద్ధిగా పని చెయ్ అని పేర్కొన్నారు. కేసీఆర్ యాత్రను రైతులు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

Read Also: Kavitha: సీబీఐ విచారణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు