Delhi High Court: భర్త తప్పు లేకుండా పదేపదే భార్య తన అత్తగారి ఇంటి నుంచి వెళ్లిపోవడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరస్పర మద్దతు, ఒకరిపై ఒకరికి విధేయతతో వివాహం వికసిస్తుందని, దూరం మరియు పరిత్యాగం ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంజ్ పేర్కొంది. భార్య క్రూరత్వం, విడిచిపెట్టిన కారణంగా భార్యభర్తలకు విడాకులు మంజూరు చేసింది.
విడాకులు కోరిన వ్యక్తి తన పిటిషన్‌లో తన భార్య అస్థిరమైన స్వభావాన్ని కలిగి ఉందని, ఆమె కనీసం ఏడు సందర్భాల్లో తనను విడిచిపెట్టి వెళ్లిందని ఆరోపించారు. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 19 ఏళ్ల వివాహ బంధంలో ఏడు సార్లు, ఒక్కో సమయంలో 3 నుంచి 10 నెలల వరకు భార్య, భర్తను విడిచిపెట్టినట్లు కోర్టు పేర్కొంది.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్‌కి డేట్ ఫిక్స్.. కొత్త పేరు, మరిన్ని ఫీచర్లు..
దీర్ఘకాలం పాటు విడిపోవడం వల్ల వివాహ బంధం కోలుకోని విధంగా విచ్ఛిన్నం కావచ్చని, ఇది మానసిక క్రూరత్వాన్ని కలిగి ఉంటుందని, సహజీవనం, దాంపత్య సంబంధాలను నిలిపివేయడం లేదా కోల్పోవడం కూడా అత్యంత క్రూరమైన చర్య అని పేర్కొంది. భర్త తప్పు లేకుండా భార్య అత్తింటిని విడిచిపెట్టిన స్పష్టమైన కేసు ఇదని, భార్య ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం క్రూరత్వానికి సంబంధించిన చర్యగా కోర్టు పేర్కొంది.
20 ఏళ్లు కలిసి గడిపినప్పటికీ, వైవాహిక జీవితంలో ఎలాంటి పరిష్కారం, మానసిక ప్రశాంతత లేకపోవడం భర్తని అనిశ్చిత జీవితానికి గురి చేసింది. ఇది మానసిక కేసు, భర్త వేదన, అతడికి విడాకులు ఇచ్చే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. అత్తింటికి తిరిగి రావడానికి భార్య ఎలాంటి తీవ్రమైన రాజీ ప్రయత్నాలను చేయలేదని, దీంతో వివాహ బంధాన్ని కొనసాగించే ఉద్దేశం ఆమెకు లేదని కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు అతనికి అర్హత ఉందని పేర్కొంది. హిందూ వివాహ చట్టం 1955లో క్రూరత్వం అనే సెక్షన్ల కింద విడాకుల్ని మంజూరు చేసింది.