Bandi Sanjay: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: PM Modi: ఆగస్టు 23 వరకు మీ సలహాలు, సూచనలు పంపండి..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
బండి సంజయ్ మాట్లాడుతూ, “బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను గాయపరిచే చర్య. రాష్ట్రంలో రోడ్డుకు అడ్డంగా ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నాయి? ఒక్క గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?” అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 80 శాతం హిందువులు ఏకమై ఈ చర్యకు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. “ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓట్లను ఆకర్షించే కుట్ర ఉంది,” అని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ అనేది కేవలం ముస్లిం రిజర్వేషన్‌గా మారింది. బీసీలకు కేవలం 5 శాతం అదనపు రిజర్వేషన్ (27 శాతం నుంచి 32 శాతం) మాత్రమే వస్తుంది, మిగిలిన 10 శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారు. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లిం రిజర్వేషన్,” అని ఆయన విమర్శించారు. ఈ విధానాన్ని తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “స్థానిక ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు,” అని ఆయన హెచ్చరించారు.
