అర్థరాత్రి సమయం 12 గంటలు…. సాధారణంగా అందరు నిద్రకు ఉపక్రమించే సమయం. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో సంఘటన జరిగి ఉంటుందని ఆందోళన చెందుతారు. అటువంటి సమయంలో సరిగ్గా అర్ధ రాత్రి 12 గంటలకు కరీంనగర్ సీపీ సత్యనారాయణ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి, కరీంనగర్ సీపీతో ‘సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది. దానిని కాపాడడానికి సహాయం చేయండి’ అని అన్నారు. మామూలుగా రకరకాల పని ఒత్తిడిలో రోజంతా గడిపిన పోలీసులు, రాత్రి సేద తీరే సమయానికి, ఇటువంటి ఫోన్ కాల్ విన్న తర్వాత అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ మాకెందుకులే అని దాట వేయకుండా, ఫోన్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేయకుండా వెంటనే స్పందించి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస రావు కి ఫోన్ చేసి, కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి, ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వాట్సాప్ లో వారి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసిపి కి షేర్ చేయడంతో…..టౌన్ ఏసీపీ, ఆ ఏరియా లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి మరియు సిబ్బందిని రెస్క్యూ టీం గా ఏర్పాటు చేసి, అర్జెంటుగా ఆ స్థలానికి వెళ్లి ఆ పిల్లి ని కాపాడే ప్రయత్నం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీం అంజి రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించి… పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించడం జరిగింది. అయితే.. సమయం అర్ధరాత్రి 12:30 మరియు 12:45 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించగా, ఆ పిల్లి యజమాని ఆనందంతో పోలీసు లకు కృతజ్ఞతలు తెలపాడు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి ఎన్ని గంటల కైనా డయల్ 100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి, ఆ ఆపద నుండి కాపాడతారని , ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని స్పష్టం చేశారు.