కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని… గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… మృతుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.