ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ, ఏపీల్లో తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలను కాదని తానే అధికారంలోకి వస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే బడుగులు, బలహీర వర్గాలు, నిరుద్యోగులు, రైతులకు అండగా నిలుస్తానని వాగ్ధానాలు చేస్తున్నారు. తనకు ఉన్న పరిచయాలు, పలుకుబడితో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తెస్తానని హామీలు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
Read Also: Harish Rao: తెలంగాణ 2వ స్థానంలో.. గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో..
ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. తాను తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటు వరద బాధితులకు సహాయం చేస్తా అని అన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ఉండబోతోందని వెల్లడించారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని తెలిపారు. విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరద బాధితులు ఉన్నారని.. అయితే ఆదుకునే నాయకుడు మాత్రం లేదని విమర్శించారు. తెలుగు ప్రజలు నిరుత్సాహ పడొద్దని.. తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేందుకు అందరితో కలిసి పోరాటం చేస్తా అని వెల్లడించారు. త్వరలో భారత్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుందని తెలిపారు. హైదారాబాద్, అహ్మదాబాద్ లో సదస్సు ఉంటుందని కేఏ పాల్ వెల్లడించారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల ఆర్థిక సదస్సుకు హజరు అవుతారని.. వెల్లడించారు. ఎకనామిక్ సమ్మిట్ తో 8 లక్షల కోట్ల పెట్టుబడులు దేశానికి రానున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణకు నాలుగు లక్షల కోట్లు, గుజరాత్ కి నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అన్నారు.