K Ramakrishna Backs Harish Rao Comments: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! రెండు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. హరీష్ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతుంటే.. అదే స్థాయిలో టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హరీష్ రావుకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ మద్దతు తెలిపారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని నిలదీశారు. అంతేకాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా? పీఆర్సీ, సీపీఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లలేదా? ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి వేధించటం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి టీచర్లను కూడా షాపుల ముందు నిలబెట్టారని మండిపడ్డారు. హరీష్ రావు ఉన్నది చెప్తే.. వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు? అని ప్రశ్నించిన కే. రామకృష్ణ.. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను జగన్ ప్రభుత్వం అవలంభించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ప్రశ్నిస్తూ.. హరీష్ రావుపై సజ్జల రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు మాట్లాడిన సందర్భం వేరు అయినప్పటికీ.. ఇష్టమొచ్చిన రీతిలో ఏపీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నా.. ఫిట్మెంట్ ఇవ్వలేకపోయారని హరీష్ రావు చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు. తెలంగాణ పథకాలపై ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు చేసినా.. తాము పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. హరీష్ రావు ఇతర రాష్ట్రాలపై గానీ, ప్రభుత్వ ఉద్యోగులపై గానీ ఏనాడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఆ ఈర్ష్యతో ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వైయస్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను తీసుకుంటోందని మండిపడ్డారు. నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.