ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల ప్రభావం జమ్మూకాశ్మీర్ సహా భారత్ పై అంతగా ఉండదు అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారంలో ప్రైవేట్ యూనివర్సిటీ లో సెమినార్ కు హాజరైన ఒమర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోకి చొరబాటుదారుల సంఖ్య బాగా తగ్గింది, దేశ సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా జమ్మూకాశ్మీర్ ను విభజించారు. స్థానిక ప్రజలు నైరాశ్యంలో వున్నారు. భారత్ – పాక్ దేశాల మధ్య అద్భుతం జరిగితే తప్ప సంబంధాలు మెరుగయ్యేలా లేవు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించినంత మాత్రనా రెండు దేశాల విభేదాలు సమసిపోవు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ కు ఏం చేశారో చెప్పాలి. యువత రాజకీయాల్లోకి రావాలి’ అని ఒమర్ అబ్దుల్లా కోరారు.