Jagga Reddy Counter To Bandi Sanjay Comments: భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ వేశారు. బండి సంజయ్ గాంధీ కంటే ముందు పుట్టాల్సిందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బిజెపి వాళ్ళు ఎక్కడున్నారని నిలదీశారు. ఇక కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, సముద్రంలో చేపలు వస్తుంటాయి పోతుంటాయంటూ.. అంతర్గత గొడవలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండటం తన అదృష్టమని చెప్పారు. అయితే.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తానిప్పుడే నోరు విప్పలేనని, నవంబర్ 5వ తేదీన గాంధీ భవన్‌లో అడుగుపెట్టిన తర్వాత తన మౌనం వీడుతానన్నారు. తాను కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగంగా జగ్గారెడ్డి పై విధంగా మాట్లాడారు.
అంతకుముందు.. చౌటుప్పల్లో క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు బండి సంజయ్, అరుణ పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ దేశాన్ని కాంగ్రెస్ మూడు ముక్కలు చేసిందని ఆరోపించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని.. హర్ ఘర్ తిరంగా’ ఘర్ ఘర్ తిరంగా అవ్వాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలని, ఈ నెల 13న ప్రజలు ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు. ఒక్క కుటుంబంతో స్వాతంత్రం రాలేదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ ఈ స్వాతంత్రమన్నారు.