ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. పరిస్థితులకు అనుగుణంగానే కొనుగోలు జరుపుతామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక వంకలతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పండిన ప్రతీ వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దురహంకారి పెట్టుబడిదారుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
కేంద్రం వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు చెప్పాల్సింది పోయి తెలంగాణ పైన కక్ష సాధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమే వరి కొనాలని గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థాయిలలో తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపుతామన్నారు. ధాన్యం విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారథ్యంలో లో రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తామన్నారు.