అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలి అంటూ ఉద్యమం మొదలైందే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు కొనసాగింపే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు అని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని యువత గుర్తించినందునే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. ఈ మేరకు శనివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకు పరాకాష్టే బీహార్,సికింద్రాబాద్ ఉదంతాలు అని ఆయన చెప్పారు. ఇది మరింత ముదరక ముందే మోడీ సర్కార్ అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న పొరాటంగా పైకి కనిపిస్తున్నప్పటికీ బీజేపీ పాలనపై రగిలిపోతున్న యువత ఆగ్రహం ఈ రూపంలో వెల్లడైందన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోడీ ఎన్నికల వాగ్దానం అమలుకు నోచుకోక పోవడం కూడా కట్టలు తెంచుకున్న యువత ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోందన్నారు. మోడీకి ముందు దేశాన్ని పాలించిన పాలకులు దోచుకొని విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెస్తా అని ఎన్నికల్లో లబ్దిపొందిన మోడీ సర్కార్ ఆ పద్దతిలో చర్యలు తీసుకోక పోవడం కుడా వారి ఆవేశానికి కారణంగా కనిపిస్తుందన్నారు. అటువంటి అగ్నిపథ్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రోశంతో రగిలిపోతున్న యువత సహనానికి పరీక్షలు పెడితే ఎదురయ్యే పరిణామాలకు బీహార్, సికింద్రాబాద్ సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు.