అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తగ్గేదేలే అంటోంది. నార్సింగి మునిసిపల్ గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానుల గుండెల్లో హెచ్ ఎండీఏ అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. 111 జీవోకు తూట్లు పెట్టి యజమానులు బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 111 జీవోలో జీ+1 మాత్రమే అనుమతులు ఉండగా, జీ+6 బహుళ అంతస్తుల భవనాలను బిల్డర్స్ చేపట్టారు. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నార్సింగి కమీషనర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోరు మెదపడం లేదు. గౌలిదొడ్డిలో 7 అక్రమ నిర్మాణాలు అధికారుల బృందం నేల మట్టం చేసింది.
ఈ కూల్చివేతల పర్వం ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు నేతృత్వంలో కొనసాగింది. అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తుండడంతో కూల్చివేతలు నార్సింగి చైర్ పర్సన్ రేఖ యాదగిరి అడ్డుకున్నారు. అధికారులకు చైర్మన్ కు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కు ఫోన్ చేసినా స్పందించపోవడంతో ఎమ్మెల్యే. కక్ష పూరితంగా నా వార్డులోనే నిర్మాణాలు కూల్చివేతలు చేస్తున్నారని రేఖ యాదగిరి మండిపడ్డారు. నార్సింగి మునిసిపల్ లో చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆ నిర్మాణాలు మీకు కనిపించడం లేదా అంటూ అధికారులను చైర్మన్ నిలదీశారు.