Hyderabad: వికారాబాద్ జిల్లాలో భారీగా కురిసిన వర్షానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌కు 12,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 15 గేట్లను తొమ్మిది అడుగుల మేర ఎత్తి 13,335 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడిచి పెడుతున్నారు. ఇదే సమయంలో అటు హిమాయత్ సాగర్‌లోకి 18,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 11 గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు 20,872 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ రెండు జలాశయాల నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల వరద నీరు మూసీ నదిలోకి చేరుతుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
దీంతో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తూ చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలపై ఓవర్‌ఫ్లో అవుతోంది. ఇక, పురానాపూల్ 100 ఫీట్ రోడ్డుతో పాటు చిన్న బ్రిడ్జి వద్ద రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఎంజీబీఎస్ బస్టాండ్ ఆవరణలోకి కూడా నీరు చేరింది. మూసీ పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు, బల్దియా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.