హైదరాబాద్‌లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. నిందితులను అరెస్టుచేసి విచారణ చేస్తుండగా వెల్లడించిన విషయాలతో పోలీసులు అవాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హరియానాకు చెందిన ఓ గ్యాంగ్ ఎస్‌బీఐ ఏటీఏంలనే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 27 మంది బంధువులకు సంబంధించి ఫేక్ అకౌంట్స్ సృష్టించిన ఈ గ్యాంగ్.. ఏటీఎంలో డబ్బులు డ్రాచేస్తున్నప్పుడు డబ్బులు వచ్చే సమయానికి పెన్, స్టిక్ అడ్డుపెట్టి సాంకేతిక సమస్యలు సృష్టించేవారు.
డబ్బులు వచ్చే సమయంలో ఏదైనా అడ్డురాగానే టెక్నికల్ ఎర్రర్ అంటూ మెషీన్ ఆగిపోవడంతో సాఫీగా డబ్బులు తీసుకెళ్లేవారు. తిరిగి డబ్బులు రాలేదంటూ కస్టమ్ కేర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు ఇచ్చేవారు. ఎస్‌బీఐ బ్యాంక్ అయితే తిరిగి 3 రోజులు డబ్బులు చెల్లిస్తున్నారని అందుకే ఇలా పథకం వేశామని నిందితులు వెల్లడించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. అయితే తాజాగా ఈ ముఠాకు చెందిన అసిఫ్ ఖాన్, మహుమద్ సాదిక్, అబ్దుల్ రెహన్, సోహెల్ లు అసామాబాద్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో మోసానికి పాల్పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఏటీఎంలో జరిగే తతంగం రికార్డ్ అవ్వకుండా సీసీటీసీ కెమెరా వైర్లను నిందితులు కట్ చేస్తున్నారని పోలీసుల తెలిపారు. నిఘా తక్కువగా ఉన్న ఏటీఎం సెంటర్లపై రెక్కీ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల పేర్కొన్నారు. నిందితులతో పాటు 25,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.