Telangana Assembly Special Session: తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది.. బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.. ఆ తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వైపు అడుగులు వేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. అందుకే ప్రత్యక సమావేశాలు ఏర్పాటు చేసింది..
తెలంగాణ శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనిది ఇప్పుడు జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ బిజినెస్ ప్రారంభం కాకుండానే వాయిదా వేయడం ఎంతో ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. ఈ నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేల పరువు పోయిందని, అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కారని అన్నారు. ఇది తెలంగాణ శాసనసభ పరువు తీశారని తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.