క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు వివరాలను శనివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్ర ఇల్లు-నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పారు. సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో ఎలాగైనా దొంగిలించాలని ప్రణాళిక రచించుకున్నాడని పేర్కొన్నారు. దీని కోసం నెల రోజుల క్రితమే పేపర్‌పై స్కెచ్ గీసుకున్నట్లు తెలిపారు.
ఈనెల 18న తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే నిందితుడు సహస్ర ఇంటికి వచ్చాడని.. ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తోందన్నారు. కిచెన్‌లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకెళ్తుండగా అలికిడికి సహస్ర అరిచించిందని.. దీంతో నిందితుడు పారిపోతుండగా సహస్ర చొక్కా పట్టుకుందని.. వెంటనే బెడ్రూమ్‌లోకి తోసేసి కత్తితో పొడిచేశాడన్నారు. ఈ సమయంలో నిందితుడి ఇంట్లో తండ్రి, సోదరీమణులు ఉన్నారని.. చాటుగా వెళ్లి బాత్రూమ్‌లో స్నానం చేసి బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసినట్లు తెలిపారు.
ఎవరైనా కనిపిస్తే బెదిరించడానికే నిందితుడు కత్తి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అదేరోజు తల్లి అడిగితే తనకేమీ తెలియదని చెప్పాడని.. రెండోరోజు అడిగింది.. మూడోరోజు అడిగితే నువ్వే నన్ను పట్టించేటట్లు ఉన్నావని నిందితుడు ఆవేశపడ్డాడని తెలిపారు. హత్య చేసిన తర్వాత కత్తి బయట కడిగేసి.. టీ షర్ట్ కప్పుకుని లోపలికి వెళ్లాడని.. అనంతరం బాత్రూమ్‌లో స్నానం చేసి ఆ బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశాడని వివరించారు. అయితే రెండు నెలల క్రితం మొబైల్ వచ్చిందని.. అదెక్కడిది అని అడిగితే సమాధానం చెప్పలేదని తల్లి తమతో చెప్పిందని పేర్కొన్నారు.
నిందితుడు సరిగ్గా స్కూల్‌కు వెళ్లడని.. ఇంట్లో ఎప్పుడూ ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూస్తూ ఉంటాడని పేర్కొన్నారు. ఇక ఈనెల 18న ఉదయం 11:30కి కుందేల్ కూడా చనిపోయిందని… ఆ స్టోరీ కూడా నిందితుడు వివరించాడన్నారు. సహస్ర ఇంటికి నిందితుడు పలుమార్లు వెళ్లాడని.. డోర్ లాక్ చేయరన్న విషయం తెలిసే ఈరోజు దొంగతనాకి వెళ్లాడని తెలిపారు. ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతోనే నిందితుడు బ్యాట్ దొంగతానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు.