Man severely injured due to Chinese Manja: చైనా మాంజాదారం ప్రజల పాలిట ఉరితాడులా మారుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత చైనా మాంజా దారాన్ని వాడుతున్నారు. గాలిపటాలు నేలపై పడిపోయినప్పుడు ఆ దారం ద్విచక్రవాహనదారులు, పాదచారులకు ప్రమాదంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వేగంగా బైకుపై వెళ్తున్న సమయంలో గొంతకు, మొహానికి చిక్కుకుని ప్రాణాలకు ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
Read Also: New Type Helmet: కొడుకుల కోసం కొత్త హెల్మెట్ తయారు చేసిన తల్లి
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధితో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మాంజాదారం బారినపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఫతే నగర్ ఫ్లైఓవర్ రోడ్డుపై వెళ్తున్న నగేష్ అనే వ్యక్తికి మాంజాదారం గొంతుకు కోసుకుపోయింది. దీంతో రోడ్డుపై పడిపోయాడు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయాలపాలైన వ్యక్తిని బహుదూరపురకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అంతకుముందు ఇలాగే నాగోల్ ప్రాంతంలో తండ్రిలో బైకుపై వెళ్తున్న బాలిక కూడా మాంజాదారం బారిన పడి తీవ్రంగా గాయపడింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ పోలీసులు అక్రమంగా చైనా మాంజాదారం అమ్ముతున్న వారిపై దాడులు నిర్వహించారు. రాచకొండ పరిధిలోని విస్తృతంగా సోదాలు చేశారు. మాంజాదారాన్ని అమ్ముతున్న నలుగురు వ్యాపారులపై రాచకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాంజాదారాన్ని మీర్ పేట్ పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.