హైదరాబాద్ లో మరో హత్య జరిగింది. సరూర్ నగర్ లో నాగరాజు హత్య ఘటన మరవక ముందే మరో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అక్కసుతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని అత్యంత విచక్షణారహితంగా పొడిచిపొడిచి హత్య చేశారు. ఈ ఘటన బేగంబజార్ షాహీనాథ్ గంజ్ లో చోటు చేసుకుంది. రెండు బైకులపై వచ్చి యువకులు ప్లాన్ ప్రకారం నీరజ్ పన్వార్ ను 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రెండు బైకులపై వచ్చిన ఐదుగురు రోడ్డుపై వెంటాడి వెంటాడి చంపేశారు. నీరజ్ భార్య సోదరుడే ఈ హత్యకు ప్లాన్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నీరజ్ డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏడాదిన్నర నీరజ్ పన్వార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం నీరజ్ పన్వార్ బేగం బజార్ లో నివాసం ఉంటుంటే.. భార్య అప్జల్ గంజ్ లో ఉంటోంది.
ఇటీవల సరూర్ నగర్ లో పరువు హత్య ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్నందుకు యువతి అన్న… నాగరాజు అనే యువకుడిని అత్యంత దారుణంగా రోడ్డుపైనే హత్య చేశారు. ఈ నెల 4న బైకుపై వెంటాడి నాగరాజును చంపేశారు. నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానా అన్న కాళ్ల వేళ్ల పడి చంపవద్దని వేడుకున్నా కనికరించలేదు. తాజాగా బేగం బజార్లో మరో పరువు హత్య జరగడంతో నగరం ఉలిక్కిపడింది.