ఇటీవల హైదరాబాద్ మీర్ పేటలో మహిళ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భార్యను అతి కిరాతకంగా చంపి మృగంలా ప్రవర్తించాడు భర్త. వెంకట మాధవిని చంపి, ముక్కలు చేసి కుక్కర్ లో ఉడకబెట్టి ఆ తర్వాత పొడి చేసి చెరువులో కలిపేశాడు భర్త గురుమూర్తి. ఈ దారుణ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. గురుమూర్తితో పాటు మరికొంతమంది హస్తం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు.
వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి తో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానిస్తు్న్నారు. ఒక మహిళతో పాటు మరో ఇద్దరి పాత్ర ఉండే అవకాశం ఉందని పోలీసుల అనుమానం. ఈ నేపథ్యంలో మరిన్ని విషయాలను రాబట్టేందుకు గురుమూర్తిని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. గురుమూర్తిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైపోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గురుమూర్తి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నిజనిజాలు బయటపెట్టేందుకు అవసరమైతే గురుమూర్తికి పాలీ గ్రాఫ్ టెస్టులు నిర్వహించేందుకు రెడీ అవుతున్న పోలీసులు.