చౌటుప్పల్‌లో ఆగి ఉన్న ఓ ఎరువుల లారీ అపహరించిన ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని ఓ ఎరువుల దుకాణానికి ఓ లారీ డ్రైవర్ లారీలో ఎరువుల లోట్ తీసుకువచ్చాడు. ఎరువుల దుకాణం చిరునామా దొరకకపోవడంతో చిరునామా కోసం లారీ నుంచి కిందకు దిగాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు యూరియా బస్తాల లోడ్‌తో ఉన్న లారీని చోరీ చేశారు. డ్రైవర్ దిగడాన్ని గమనించి లారీతో ఉడాయించారు. దీంతో ఖంగుతిన్న లారీ డ్రైవర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వరుస గొలుసు చోరీలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఇందిరా నగర్‌లో మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల పెస్తెలతాడును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. జూబ్లీహిల్స్‌లో కూడా మరో మహిళ మెడలో గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.