రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, మెసేజెస్, లింక్స్ పంపించి ఖాతాలు లూటీ చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచేశారు సైబర్ క్రిమినల్స్. ఈమెయిల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ కంపెనీ హాంకాంగ్ కంపెనీ నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తుంది. ముడిసరుకు అందిన తరువాత కంపెనీ నగదు బదిలీ చేస్తోంది.
అయితే హాంకాంగ్ కంపెనీతో కొనుగోళ్ళు, ఆర్థిక లావదేవీలు మొత్తం కూడా మెయిల్స్ ద్వారానే కొనసాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్తులు ఈమెయిల్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత ముడి సరుకు కావాలంటూ సదర్ కంపెనీ హాంకాంగ్ కంపెనీకి ఎప్పుడు మెయిల్ పెడుతుందా అని ఎదురుచూశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కంపెనీ ఆ కంపెనీకి సరుకు కావాలంటూ మెయిల్ పెట్టింది. అయితే ముడిసరుకు చేరుకున్న తర్వాత నగదును మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ సైబర్ నేరస్తులు మెయిల్ పెట్టారు. ప్రస్తుత అకౌంట్ ఆడిట్లో ఉన్నందున మరో అకౌంట్ కు బదిలీ చేయాలంటూ మెయిల్ పంపించారు.
హైదరాబాద్ కు చెందిన కంపెనీ రూ. 10 కోట్లను ఆ అకౌంట్ కి బదిలీ చేసింది. వారం రోజుల తర్వాత హైదరాబాద్ కంపెనీకి నగదు రాలేదంటూ హాంగ్‌కాంగ్ కంపెనీ సమాచారం ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న హైదరాబాద్ కంపెనీ సిబ్బంది, వారం క్రితమే డబ్బులు బదిలీ చేసిన అకౌంట్ డీటెయిల్స్ ని హాంగ్‌కాంగ్ కంపెనీకి పంపించారు. ఇది పరీశీలించిన తర్వాత ఆ అకౌంటు తమది కాదని, ఆ మెయిల్ కూడా తాము పంపలేదని హాంకాంగ్ కంపెనీ సిబ్బంది తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన హైదరాబాద్ కంపెనీ సిబ్బంది సైబర్ సెల్ ల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.