CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు గాను ఈ రోజు (శుక్రవారం) రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి చెన్నై చేరుకున్నారు. డీలిమిటేషన్ పై తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా ఏ విధంగా నష్టపోతాయనే అంశంపై ఇప్పటికే పలు వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలియ జేశారు.
Read Also: Operation Garuda: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
అయితే, చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సమావేశంలోనూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను దేశ ప్రజల ముందుంచనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. అనంతరం తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఎంకే స్టాలిన్, పినరాయి విజయన్, భగవంత్ మాన్ లతో కలిసి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.