భాగ్యనగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆరాంఘర్- జూపార్కు ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్లు రూ.800 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించింది. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ వంతెనతో బెంగళూరు హైవేకు ట్రాఫిక్ అంతరాయం తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.
గద్వాల విజయలక్ష్మి..
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా నిర్మించడానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నో సమస్యలను అధిగమిస్తూ.. ప్రజాపాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కొనియాడారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం నగర అభివృద్ధికి మరో మైలు రాయిగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యంత్రికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు.