CM Revanth Reddy: గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.
Read also: Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు
ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. సుదీర్ఘ పోరాట ఫలితం. అనేక ప్రాణత్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం. ఎందరో మహామహుల త్యాగాల వెల కట్టలేని బహుమతి ఈ స్వాతంత్య్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ…. యుద్ధం… హింస. కానీ, ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్ర్య పోరాటం. అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్య్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి… ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మాగాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు, శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
Read also: Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..
ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం. ఒక వైపు సవాలక్ష సమస్యలు. మరోవైపుదేశ విభజన గాయాలు. ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుంపట్లు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి… ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి… కార్యాచరణలు ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం వహించినా, రాజనీతి లోపించినా, దూరదృష్టి కొరవడినా నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయి ఉండేది.
Read also: DSC Recruitment Process: సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?
శతాబ్దాల దోపిడి, అణచివేతల తరువాత స్వాతంత్ర్యానంతరం 1947 లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్లు కూడదీసుకుని, ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, పారదర్శక, ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవతావాది, దార్శనికుడి కారణంగా భారతదేశం ఈ నాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగ కలిగింది అని చెప్పక తప్పదు. పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ, ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే… ఆ తర్వాత వాటిని పూర్తి చేసి, కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకి దక్కుతుంది.
Read also: Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
అంతేకాదు, పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినవే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడుకి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆ నాటి దార్శనికుల వల్లనే జరిగింది. 1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనదేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయాంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకు రాగా… ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ స్వర్గీయ పీవీ నర్సింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారత దేశ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఇట్లా… నెహ్రూ హయాంలో మొదలైన భారత దేశ విజయ ప్రస్థానం ఇందిరా, రాజీవ్, పీవీ హయాంతో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర సాధనతోపాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..