దొంగతనం.. డబ్బులు సంపాదించడానికి ఏ మార్గాలు దొరక్క, చివరికి ఈ అడ్డదారిని ఎంచుకుంటారు కొందరు! జేబులు కత్తిరించడం దగ్గర నుంచి ఇళ్లకు కన్నాలు వేసేదాకా.. రకరకాల దొంగలు ఉంటారు. ఏదేమైనా సరే, వీరి లక్ష్యం డబ్బులు దొంగలించడమే! అయితే, మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం చాలా డిఫరెంట్! సూటిగా, సుత్తి లేకుండా.. నేరుగా అతని స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి!
ఆ దొంగ పేరు ఫరీద్. హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన ఇతను, మొదట్లో ఓ కూరగాయాల వ్యాపారి. సైకిల్‌పై గల్లీ గల్లీ తిరుగుతూ కూరగాయలు విక్రయించేవాడు. అయితే.. తోటి వ్యాపారులు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై తిరుగుతూ అమ్మకాలు సాగిస్తుండడం చూసి, తానూ ఓ ఎక్స్‌ఎల్ కొనాలని అనుకున్నాడు. కానీ, తన వద్ద అంత డబ్బు లేదు. వచ్చే సంపాదన మొత్తం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. దీనికితోడు, అతని నెత్తిన మరిన్ని ఆర్థిక సమస్యలున్నాయి. ఎంత ఆదా చేద్దామన్నా, చిల్లిగవ్వ మిగిలేది కాదు. దీంతో, ఓ ఎక్స్‌ఎల్‌ని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే ఒక ఎక్స్‌ఎల్‌ని దొంగలించాడు. ఈ దొంగతనం చాలా సులువుగా అయిపోవడంతో, రెగ్యులర్‌గా మోపెడ్‌లను ఎత్తుకెళ్లడం మొదలుపెట్టాడు.
ఒక మోపెడ్ చోరీ చేసి, తన మోజు తీరేదాకా దానిపై తిరిగేవాడు. అనంతరం రూ. 10 వేలకు అమ్మేసి, మరో ఎక్స్‌ఎల్‌ని చోరీ చేసేవాడు. ఇలా 24 వ్యవధిలో 23 మోపెడ్లను దొంగలించాడు. ఎక్స్ఎల్ వాహనాలే చోరీ అవుతున్నట్టు కేసులు వస్తున్నాయని గమనించిన పోలీసులు, ఇది ఎవరో ఒక వ్యక్తే చేస్తున్న వ్యవహారమని పోలీసులు భావించారు. పక్కా ప్లాన్ వేసి, చివరికి ఫరీద్‌ని పట్టుకున్నారు. కేవలం ఎక్స్‌ఎల్ వాహనాల్నే ఎందుకు దొంగలించావని ప్రశ్నిస్తే.. తనకు గేర్లు ఉండే ఇతర బైకులు నడపడం రాదని, అందుకే ఎక్స్ఎల్ మోపెడ్లనే చోరీకి ఎంచుకున్నానని ఫరీద్ తెలిపాడు. ప్రస్తుతం అతడ్ని రిమాండ్‌కు తరలించారు.