ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్ వాళ్లకు కనిపించింది. ఉదయాన్నే ముగ్గురు వ్యక్తులు డిగ్రీ కాలేజీకి మెయిన్ గేటుకు రంగులు వేస్తూ వాకర్స్‌కు కనిపించారు. అయితే పెయింట్ వేసే వాళ్లలో కాలేజీ ప్రిన్సిపాల్ బీమార్జున్‌రెడ్డి కూడా ఉన్నారని వాళ్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో వాకర్స్ ఆప్యాయంగా ప్రిన్సిపాల్‌ను పలకరించారు. ఆయనలో ప్రిన్సిపాల్ అనే దర్పం లేదని.. అంతటి హోదాలోనూ సాదాసీదాగా పనిచేస్తుండటం నమ్మశక్యంగా అనిపించలేదని వాకర్స్ అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు గ్రంథాలయ అధికారి నాగరాజు, మరొక విద్యార్థి రాత్రంతా కళాశాలలోనే ఉండి పొద్దున్నే కాలేజీకి స్వయంగా రంగులు వేస్తున్నారని వారు వెల్లడించారు.

ఈ మేరకు వాకర్స్ ప్రిన్సిపల్ పెయింట్ వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీ నీటుగా ఉండేందుకు ప్రిన్సిపాల్ బీమార్జున్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని.. నిధులు లేకపోయినా అంకితభావం, పట్టుదలగా పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చారని.. కాలేజీని గ్రీనరీ మయం చేశారని కొనియాడుతున్నారు. కొందరు ఉద్యోగులు సమయానికి కళాశాలకు రావటమే గగనంగా మారిన ఈ రోజుల్లో రాత్రులు కళాశాలలోనే ఉండి కాలేజీ గురించి ఆలోచించడం అభినందనీయమని అంటున్నారు. మొత్తం కాలేజీలో 14 మంది అధ్యాపకులు, 350 మంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు వాకర్స్ తెలిపారు. ప్రతి పనికి లంచం తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ, నిబద్ధత గల ప్రిన్సిపాల్ హుజూర్ నగర్ డిగ్రీ కళాశాలకు దొరకడం నిజంగా ఓ వరమని పేర్కొన్నారు.
Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు