భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నికకు దారితీసింది. హుజురాబాద్ లో మరోసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరవేసేందుకు కేసీఆర్ తన అనుచర గణాన్ని మొత్తం ఉపయోగించారనడంలో సందేహం లేదు. హుజురాబాద్ గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడించాలని గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ.. మంత్రి హరీశ్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు కేసీఆర్ అప్పగించారు.
అయితే ఆరోపణలతో రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన ఈటల మొదటి నుంచి నియోజవకర్గంలో ప్రచారం నిర్వహిస్తూ… ప్రజలను ఆకర్షించేందుకు పలు వ్యూహాలు పన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను అధిష్టానం ఈ ఉప ఎన్నిక బరిలో దించింది. వీరితో పాటు మరో 27 మంది బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యనే ఉండబోతోందని మొదటినుంచి సర్వేలు చెబుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ పూర్తి అయ్యింది.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పొలింగ్ ప్రారంభం నుంచి పలు చోట్ల చిన్నచిన్న ఘర్షణల, వాగ్వాద ఘటనలు చోటు చేసుకున్నా మిగితా పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. కానీ.. పోలింగ్ నిర్వహించిన అనంతరం ఈవీఏంలను తరలిస్తుండగా వీవీ ప్యాట్‌లను మార్చరంటూ ఓ వీడియో వైరల్ అవడంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలిసిన బీజేపీ నేతలు సీబీఐతో విచారణ జరుపాలంటూ వినతిపత్రం అందజేశారు.
ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న శశాంక్ గోయల్ కూడా కరీంనగర్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులకు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ హుజురాబాద్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రేపే ఓట్ల లెక్కింపు ఉండడంతో వీవీ ప్యాట్‌లు మార్చిన వీడియో ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోపై రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి.. ఉపయోగించని వీవీ ప్యాట్‌ను స్ట్రాంగ్ రూంకు ప్రభుత్వ వాహనంలోనే తరలిస్తుండగా ఈ వీడియో తీశారని.. ఎవ్వరూ దీనిపై అనుమానం పెట్టుకోవద్దంటూ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రాల నుంచి కరీంనగర్ స్ట్రాంగ్ రూంకు వెళ్లే దారిలో బస్సులు పలు చోట్ల ఆగాయని.. ఈవీఏంలను మార్చారంటూ బీజేపీ నేతలు మరో ఆరోపణకు తెరలేపారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఆది నుంచే ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా ముసిందనుకున్న అధికారులకు ఈ వీడియో వైరల్ కావడంతో మరో తలనొప్పిగా తయారైంది. పోలింగ్ ముగిసే సమయానికి పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి గెలుస్తుందనే ఫలితాలు వెలువడ్డాయి. సర్వేల్లే బీజేపీ గెలుస్తుందనే విషయం తెలిసి అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇంత అన్యాయానికి ఒడిగడతారా అంటూ ఈటల మండిపడ్డారు. ఏదీఏమైనా రేపు జరుగనున్న ఓట్ల లెక్కింపుతో హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్‌కు తెరపడనుంది.