హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారులు తగ్గేదే లే అన్నట్లుగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే తాజాగా బోడుప్పల్ లో రెండు, దమ్మాయిగూడలో ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఇప్పటివరకు 158 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. గత కొన్ని వారాలుగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాద మోపుతున్నారు. అందులో భాగంగా బుధవారం రెండు మున్సిపాలిటీల పరిధిలో మూడు (3) అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి.
బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలపైన, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఒక అక్రమ నిర్మాణంపై టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా సర్వే నెంబర్ 6లో గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులు(జి ప్లస్ ఫోర్) నిర్మాణాన్ని, మరొకచోట సర్వే నెంబర్ 133 లో సెల్లార్, గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు(సెల్లార్+జి+ త్రీ ఫ్లోర్స్) నిర్మాణంపై కూల్చివేత చర్యలు చేపట్టారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు (జి+ త్రీ ఫోర్స్) నిర్మాణాన్ని హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చివేశారు.