Heavy Rains In Telangana: తెలంగాణ భారీ వర్షాలు మరోసారి దంచి కొడ్తున్నాయి. కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో బ్రేక్ ఇచ్చిన వరుణుడు, ఇప్పుడు మళ్లీ విలయ తాండవం చేస్తున్నాడు. వాతావరణ శాఖ ప్రకారం.. తాజాగా భారీ వర్షపాతం నమోదైనట్టు తేలింది. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలో 13.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే.. వికారాబాద్ జిల్లా దుద్యాలలో 12.1 సెంటిమీటర్లు, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెళ్లిలో 10.6, మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో 10.6, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 9, హైదరాబాద్ జిల్లా డబీర్‌పురాలో 8.3, ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద 8.7, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 8.1, వికారాబాద్ జిల్లా ధారురులో 8.1, హైదరాబాద్ తిరుమలగిరిలో 7.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ వాఖ తెలిపింది.
ఈ భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అటు, ప్రాజెక్టులు తిరిగి నిండుకుండలా మారాయి. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు భారీ గండి పడటంతో, కొన్ని కేంద్రాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సుమారు 6 అడుగుల మేర నీళ్లు నిలిచాయి. వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది.