Heavy Rains In Telangana.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు పలిమెల, మహాముత్తారం, మహదేవపూర్,కాటారం మండలాలను వరద నీరు ముంచెత్తింది. వరద పూర్తిగా తగ్గగా ఆయా మండలాల్లో బురద మిగిలింది. పలిమెల,మహముత్తారం,మహదేవపూర్ మండలాలోని వివిధ గ్రామాల్లో పత్తి,వరి చేన్లలో బురద చేరింది. పత్తి మొక్కలు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలు ఇళ్లను ముంచేయడంతో ఇళ్లలో ఉన్న వడ్లు, బియ్యం, పెసర్లు, నిత్యావసర సరుకులు,ఇతర వస్తువులు తడిసిపోయాయి. వరద నీటి నుంచి పలిమెల పోలీస్ స్టేషన్ శనివారం బయటపడింది.
కాళేశ్వరానికి ఎగువ నుంచి భారీగా వరద చేరింది. అత్యధికంగా 16.90 మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదు అయింది. మహదేవపూర్ మండలంలో 1,260 ఎకరాలు, పలిమెల మండలం లో 970 ఎకరాల్లో పత్తి పంట వరద నీటిలో మునిగిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా సర్వే చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి తీరం కావడంతో పంట భూముల్లో పూర్తిగా బురద, ఇసుక మేటలు వేసింది. కాళేశ్వరం తీరంలోని చిరువ్యాపారుల దుకాణాలు, హోటళ్లలో బురద మేటలు వేసింది .దీంతో వరద బాధితులు శుభ్రం చేసుకునే పనిలోనే పడ్డారు. కాళేశ్వరం పరిధిలోని పూస్కుపల్లి జలమయం కాగా ఇళ్లలోకి వరద నీరు తగ్గడంతో ఇళ్లలో బురద మేటలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని స్తానికులు డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి వరద నీటిలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా నీట మునిగి కాళేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలో 12 గ్రామాలు పూర్తిగా అందకారంతో చీకట్లు కమ్ముకున్నాయి. కనీసం మంచినీరు లభించని దుస్థితి నెలకుంది. కాటారం వయా మహదే వపూర్ మీదుగా వచ్చే 33కేవీ విద్యుత్ లైన్ పూర్తిగా నీటమునిగిపోయింది. అధికారులు. ఉద్యోగులు యుద్ధప్రాతిపాదికన నీటి లో తెప్పలు వేసుకొని సాహసించారు. పాత 11కేవీ
విద్యుత్ లైన్ను పునరుద్ధరించారు. శుక్రవారం రాత్రి సరఫరా అందజేశారు.