వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి దెబ్బ తగిలింది.
దీంతో కొన్ని రోజులకు కాలు ఇన్ఫెక్షన్ కాగా గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓజోన్ ఆస్పత్రిలో చేర్పించారు. గత 47 రోజులుగా అంజనమ్మ ఓజోన్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇందుకుగాను రూ.13 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించారు. గత రాత్రి వరకు అంజనమ్మ ఆరోగ్యం బాగానే ఉందని రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి గడిచేసరికి చనిపోయిందని మరో రూ. 2 లక్షల బిల్లు చెల్లిస్తేనే అంజనమ్మ మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో మృతురాలి బంధువులు హాస్పటల్లో ఆందోళనకు దిగారు.