సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు కడుపు కోతలు అవుతుంటే, బాధ అనిపిస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
సిజెరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చేయడంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కరోనా సమయంలో బాగా పని చేశారని, అదే తీరును కొనసాగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్… పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, మందులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత లేకుండా చూస్తున్నారని, కాబట్టి నూతనోత్సాహంతో పని చేసి అరోగ్య శాఖకు మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.