Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అక్షరాల రూ.50 వేల కోట్ల భారీ మోసం జరుగుతోందని, దీనిలో 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.
రాష్ట్రంలో విధాన నిర్ణయాల కోసం నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాలు, ఇప్పుడు పంపకాల కోసం మాత్రమే జరిగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాలు వరుసగా భూ స్కాం, పవర్ స్కాం కోసం జరిగాయని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల ల్యాండ్ స్కాం ను బయట పెట్టినా, ప్రభుత్వం దానిపై ఒక్క సమాధానం కూడా చెప్పలేదని హరీష్ రావు మండిపడ్డారు.
రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో రూ.50 వేల కోట్ల భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “రేవంత్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమిషన్” అని వ్యాఖ్యానిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలలో ప్రజల ప్రయోజనం కంటే స్వప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేసీఆర్ గతంలో చెప్పిన విషయం ఇప్పుడు నిజమవుతోందని హరీష్ వ్యాఖ్యానించారు. వాటాల విషయంలో తలెత్తిన అంతర్గత తగాదాల వల్ల మంత్రులే రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే వెంటనే డర్టీ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీపీసీ తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు సిద్ధంగా లేఖ రాసినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్టీపీసీ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ నిర్మాణంపై గతంలో తీవ్రంగా విమర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “కమీషన్ కోసమే కోమటిరెడ్డి పెదవులు మూసుకున్నారా?” అని హరీష్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
పథకాల అమలుకు డబ్బుల్లేవని ప్రభుత్వం చెప్పుకుంటూనే, వేల కోట్లతో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లను డబుల్ కాస్ట్‌తో నిర్మించడం అంటే కమీషన్ల కోసం చేస్తున్న ప్రాజెక్టులేనని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతి రోజు తన మాటలను మార్చుకుంటారని, ‘రామ్-రెమో’ లెక్క రోజుకో కొత్త కథ చెబుతున్నారని హరీష్ వ్యాఖ్యానించారు.
26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 17 ఏళ్లు.. ఆనాటి హీరోలను ఎలా మరవగలం..