Harish Rao Questions Bandi Sanjay Over Central Funds: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న సంధించారు. మోటర్లకు మీటర్లు పెట్టకుంటే.. 5 ఏళ్లలో రూ. 30 వేల కోట్లు ఎందుకు ఆపారు? అని నిలదీశారు. ఢీల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేతకాదని, నూకలు బుక్కుమని అంటున్నారంటూ మండిపడ్డారు. తాను సిద్ధిపేటను అభివృద్ధి చేస్తుండటం చూసి.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మీ (ప్రజల్ని ఉద్దేశించి) దయతో ఆరోగ్య మంత్రిని అయ్యానన్నారు. సిద్ధిపేట అభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమిస్తున్నానని.. ఈ ఎనిమిదేళ్లలో బీపీ, షుగర్ వచ్చినా, తిరుగుళ్లకు టెన్షన్ పడుతున్నా.. రెండు పూటల మందులు వేసుకుంటూ తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నానన్నారు. కాళేశ్వరం నీళ్లతో పెద్ద వాగును నింపుతామని, ఫలితంగా ఎప్పటికీ వాగులో నీళ్లు ఉంటాయని అన్నారు. దాంతో ఇసుక దొంగలకు ఇసుక దొరకదన్నారు. కరోనా కారణంగా రైతుబంధు ఇవ్వలేమని తాము అనుకున్నామని.. కానీ ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతు బంధు ఇచ్చామని పేర్కొన్నారు.
అంతకుముందు.. బీజేపీపై మంత్రి హరీష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లు ఉండి కూడా.. ఆయా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్ గురించి తెలుసుకోకుండా కొంతమంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నారని మండిపడ్డారు. భూ సంబంధిత సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, రూపాయి లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పారు. ధరణితో అవినీతి తగ్గిందన్నారు. డబుల్ ఇంజన్ రాష్ట్రాలని బీజేపీ చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో.. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని.. డయాలసిస్ పేషంట్ల సమస్యల్ని కేసీఆర్ గుర్తించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. గతంలో టీడీపీ పోయి కాంగ్రెస్ వచ్చినా.. తెలంగాణలో నీళ్ల బాధ పోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ల బాధలు పోయాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. హర్ ఘర్ కో జల్ పేరిట దేశం మొత్తం అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.