తెలంగాణ టీఆర్‌ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు. కేంద్ర ఓ వ్యాపార వేత్త లాగా ప్రవర్తిస్తుందని, 11 లక్షల కోట్లు బడా వ్యాపారులకు, డబ్బు మాఫీ చేస్తుంది కానీ రైతులు కష్టపడి వడ్లు పండిస్తే ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ధరల పెంచడం తెలుసు, అబద్దాలు ఆడటం తెలుసు అంటూ ఆయన మండిపడ్డారు.
ఈ కేంద్ర ప్రభుత్వంకు ఒక్క మంచి మాట, ఒక్క మంచి పని చేసింది ఉంటే చెప్పండని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా ఆదుకుంటోందని, ఫుడ్ సెక్యూరిటీ కింద వడ్లను కొనండి అని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంగా వడ్లను కొని రైతులకు సబ్సిడీ ఇవ్వండని, కేంద్ర ప్రభుత్వంకు వడ్లు ఇతర దేశాలకు పంపించే అధికారం ఉంటుంది కానీ రైతులకు అధికారం ఉండదన్నారు. మోడీ అంటే మోదుడు బీజేపీ అంటే బాదుడు లాగా బీజేపీ పార్టీ తయారు అయ్యిందని ఆయన మండిపడ్డారు. గతంలో గ్యాస్ ధర పెంచితే ప్రజలు రోడ్డుపై ధర్నా లు చేసేవారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో సబ్సిడీ కూడా ఇవ్వడం లేదన్నారు భేటీ బచావో పై ప్రచారం ఆర్భాటం చేసి పని మాత్రం శూన్యం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.