టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. అందరూ ఊహించిన విధంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మాటల్లో అచ్చే దిన్ అని.. కానీ.. చేతల్లో సచ్చే దిన్‌గా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఆలోచనలో భాగంగానే చిన్న రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు ఆత్మనిర్భర్ భారత్ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని హరీశ్‌రావు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. 14 సంవత్సరాలు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అనీ, దేశంలోనే అతిచిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాలకు దశ-దిశ చూపిందన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్ట్రాల నుంచి కేసీఆర్ ఎజెండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.