తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థ చాలా దారుణంగా ఉందని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సనత్ నగర్‌లోకి 50 పడకల ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతలు కళ్ళున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల్ని వెచ్చిస్తోందని అన్నారు.
మాజీ మంత్రి గీతారెడ్డి ఒక వైద్యురాలు అయ్యుండి కూడా.. తెలంగాణ వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహించకపోవడం చాలా బాధకరమని హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తే, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో అత్యున్నత స్థాయి సౌకర్యాలని సీఎం కేసీఆర్ కల్పించారని, ఉస్మానియా అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. 70 ఏళ్ళలో కాంగ్రెస్ కేవలం 3 కళాశాలలు ఏర్పాటు చేస్తే.. 7 సంవత్సరాలలోనే 33 కళాశాలలు కట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ది అని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
ఇదిలావుండగా.. బుధవారం గీతారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆసుపత్రులు బాగోలేవనే ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నాయని కేసీఆర్ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. టీమ్స్ ఆసుపత్రిని ఎందుకు మూయించారని ప్రశ్నించిన ఆమె.. వాగ్ధానాల్ని అమలు చేయడంలో కేసీఆర్ జీరో అని విమర్శించారు. ఆసుపత్రుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే సైతం సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులే కొనసాగుతున్నాయని, కొత్తగా కేసీఆర్ కట్టిందేమీ లేదని ఆరోపించారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయియని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు పై విధంగా స్పందించారు.