Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు. ఇంట్లోని సామాన్లు మొత్తం మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూములు సకాలంలో తెరవక పోవడం వల్ల వరద ముంచెత్తిందని ఆరోపిస్తున్నారు.
Read Also : Revanth Reddy : వరంగల్ కు సీఎం రేవంత్.. ముంపు ప్రాంతాల్లో పర్యటన
గతంలో ఎన్నడూ లేని విధంగా తాము ఇలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. చాలా ఇండ్లు నేల కూలిపోయాయని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కోరుతున్నారు. తరచూ ఇలాంటి సమస్యలు వస్తున్నా సరే తమకు శాశ్వత పరిష్కారం చూపించట్లేదని.. ప్రభుత్వాలు మారినా తమ గోడు మారడట్లేదని అంటున్నారు. చిన్న వర్షం కురిసినా సరే హన్మకొండ, వరంగల్ నగరాలు నీట మునిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు హన్మకొండ, వరంగల్ లో ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు.
Read Also : Telangana BJP : సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారు.. బీజేపీ ఫిర్యాదు