దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డాక్టర్ అనిల్‌కుమార్ గాడ్గె ఈ సందర్భంగా సింగరేణికి కితాబిచ్చారు. దక్షిణ భారత ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రధానపాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. సింగరేణి చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాలతో సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో మంచి మార్పు వచ్చిందన్నారు. ఈ సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నిపుణులు డాక్టర్ అంటోని యూస్ ప్రధానోపన్యాసం చేశారు. ఈఈఎఫ్‌కు చెందిన అనిల్ రజ్దాన్, పునీత్‌సింగ్, ఐశ్వర్య పాల్గొన్నారు.