రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ రాష్ట్రంలోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఊరురా కాంగ్రెస్ నాయకులు ప్రజలతో మమేకమవుతూ.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌తో పాటు.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఢిల్లీ బస్తీ దవాఖానలు బాగున్నాయి అన్నారని.. అంటే తెలంగాణలో ఆసుపత్రులు బాగోలేవనే కదా అంటూ చురకలు అంటించారు పీసీస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి. ఎప్పుడైనా ఆసుపత్రులకు వెళ్తే కదా తెలిసేది..? అంటూ విమర్శించిన గీతారెడ్డి.. పన్ను నొప్పికి ఢిల్లీ.. చెస్ట్ నొప్పి అంటే యశోదకు వెళ్తారు అంటూ సెటైర్లు వేశారు.
టిమ్స్ ఆసుపత్రిని ఎందుకు క్లోస్ చేశారని, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతా అన్నారు.. ఏమైంది.? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తారు.. అమలు చేయడంలో మాత్రం జీరో అంటూ మండిపడ్డారు. ప్రతి మండలంకి 100 బెడ్ల ఆసుపత్రి అన్నారు ఏమైంది.. నగరం నలుమూలల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయి..? ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.