నవరాత్రులు పూలు అందుకున్న గణనాథులు.. గంగమ్మ ఒడికి చేరే ముందు నిర్వహించే లడ్డూ వేలానికి రోజు రోజుకీ బాగా క్రేజ్ పెరుగుతోంది… గణేష్ లడ్డూ వేలంపాట అనగానే అందరికీ బాలాపూర్ లడ్డూనే గుర్తుకు వస్తుంది.. ఎప్పటి కప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ.. సరికొత్త రికార్డు నెలకొల్పుతూ ఉంటారు బాలాపూర్ గణేష్.. అయితే, ఈ సారి బాలాపూర్ గణపతి రికార్డును మొన్నటికి మొన్న అల్వాల్ గణపతి బద్దలు కొట్టేశారు.. బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ ఏడాది రూ.24 లక్షల 60 వేలకు వేలం పాటలో వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకోగా.. ఆ రికార్డును అధిగమిస్తూ అల్వాల్ మరకత లక్ష్మీగణపతి లడ్డూను రూ.46 లక్షలకు వెంకట్రావు దంపతులు సొంతం చేసుకున్నారు.. ఇక, ఆ రెండు రికార్డులు కూడా ఇప్పుడు పటాపంచలయ్యాయి..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇప్పుడు బండ్లగూడలో వెలసిన గణపతి తెలంగాణలోనే కొత్త రికార్డ్ సృష్టించారు.. బాలాపూర్, అల్వాల్ లడ్డూను దాటేసింది.. రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లా కాలనీలో లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వేలం పాటలో ఎవరూ ఊహించని రీతిలో కొత్త రికార్డులు నెలకొల్పుతూ ఏకంగా రూ.60.80 లక్షలు పలికింది. వేలం పాటలో ఆ లడ్డూను డాక్టర్ సాజీ డీసౌజా బృందం సొంతం చేసుకుంది.. ఇక, వేలంలో లడ్డూను సొంతం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు సాజీ డీసౌజా.. కుల, మతాలకన్నా మానవత్వమే ముఖ్యమన్నారు.. ఇక, లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను.. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక, ఈ ఏడాది ఇంకా ఎక్కడైనా ఈ రికార్డును బ్రేక్ చేసే లడ్డూలు ఉన్నాయేమో చూడాలి. కాగా, గతంలోనూ బాలాపూర్ గణేష్ లడ్డూ ధర కంటే.. అధిక ధర పలికిన లడ్డూలు ఉన్నా.. ఎప్పటికప్పుడూ ప్రతీ ఏడాది కొత్త రికార్డు సృష్టిస్తూనే ఉన్నారు బాలాపూర్ గణపతి.. ఇక, లడ్డూ వేలం ప్రారంభం అయ్యిందే బాలాపూర్‌లో కాబట్టి.. ఆ లడ్డూకు ఎప్పుడూ క్రేజ్ పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.