కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది.
Read Also: స్వచ్ఛతలో అన్ని నగరాల కన్నా హైదరాబాద్ ముందుంది: కేటీఆర్
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 84,127 మంది రోగులకు చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లడించారు. దేశంలోని మరే ఇతర ఆస్పత్రిలో ఇంత మంది రోగులు చికిత్స పొందలేదు. కరోనా చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారు. అంతేకాకుండా హైరిస్క్ గ్రూప్‌కు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా ట్రీట్‌మెంట్ పొందారు. మెరుగైన వైద్యం అందించడం వల్లే గాంధీ ఆస్పత్రిలో కరోనా రికవరీ రేటు 98 శాతం సాధించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 44 మంది కరోనా పేషెంట్లు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
మరోవైపు కరోనాతో పాటు ప్రజలకు దడ పుట్టించిన బ్లాక్ ఫంగస్ వ్యాధికి కూడా గాంధీ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందజేశారు. ఇప్పటివరకు 1,786 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు గాంధీ ఆస్పత్రికి రాగా వారిలో 1,163 మందికి సర్జరీలు చేసి వారి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఎక్కువగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు.