హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో కీచక పర్వం కలకలం రేపుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తానుగాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి, ఆస్పత్రి సెల్లార్‌లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో … ఈ నెల 4న ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి సహాయకులుగా అతడి భార్య, మరదలు ఆస్పత్రిలో ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు.
ఈ నెల 9వ తేదీన పేషెంట్ కుమారుడు.. తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి, పిన్ని ….7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని తెలియడంతో.. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో 11వ తేదీన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారంనాడు బాధిత మహిళ కుమారుడికి ఫోన్ చేసిన ఉమామహేశ్వర్ .. ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో మీపిన్ని ఉంది అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందన్నాడు. తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని.. ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు.
సోమవారం ఉదయానికి కోలుకున్న బాధితురాలు.. తనపై ఉమామహేశ్వర్, మరో నలుగురు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. జేబురుమాలులో మత్తుమందు స్ర్పే చేసి నోటికి అదిమిపెట్టారని.. తాను స్పృహ తప్పాక సెల్లార్‌లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని కన్నీరుమున్నీరైంది. బాధితురాలిని తీసుకుని ఆమె బంధువులు సోమవారం మధ్యాహ్నం చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఆమె ఫిర్యాదుతో ఉమామహేశ్వర్‌పై రేప్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఈ నెల 7 నుంచి 15వ తేదీ దాకా వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. ఒకవేళ వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.