సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు(8)గా గుర్తించారు. కారులో మృతి చెందిన యువకుడు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరుకు చెందిన ఫరీద్(25) అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ఢీకొట్టడంతో బైక్ పెట్రోల్ ట్యాంకర్ లీకై మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.