Fake Post: బతికున్న మనిషి చనిపోయాడంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు చివరి చూపు కోసం ఆయన ఇంటికి బారులు తీరారు. ఇంతలో అనుకోకుండా పోయాడని అనుకున్న మనిషి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాచబొల్లారం పరిధిలోని సర్వేశన్ గుట్ట ప్రాంతానికి చెందిన గణేష్ యాదవ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్‌నగర్‌లో లంగర్‌హౌస్ ఉన్న గణేష్ యాదవ్‌కు అనిల్ యాదవ్ బంధువు. అయితే రెండు నెలల క్రితం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అనిల్ యాదవ్ గణేష్ ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 8న గణేష్ యాదవ్ తన స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. విషయం తెలుసుకున్న అనిల్ యాదవ్.. గణేష్ యాదవ్ చనిపోయాడని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే గణేష్ యాదవ్‌కు ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో అతడి ఫోన్ హ్యాక్ కావడంతో ఆయన మరణ వార్త నిజమేనని భావిస్తున్నారు. అతని భార్య షాక్‌తో కుప్పకూలిపోయింది. గణేష్‌కు నివాళులు అర్పించేందుకు బంధువులు గణేష్ ఇంటికి చేరుకున్నారు.
ఇంతలోనే ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గణేష్ యాదవ్ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. షాక్ నుంచి తేరుకుని గణేష్ క్షేమంగా ఉండడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ చేసినందుకు అనిల్ యాదవ్‌పై గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుకు సంబంధించిన వివాదంతో ఇలా తప్పుడు పోస్టు పెట్టారని అనిల్ యాదవ్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న వ్యక్తిని చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నర్మగర్భంగా చేసే చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అంటున్నారు. ఎంత కోపం వచ్చినా ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అనిల్ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డి వ్యాఖ్యాల్లో తప్పులేదు.. సీతక్క సీఎం ఐతే తప్పేంటి..?