సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక గత్యంతరం లేక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపారని విమర్శించారు. లిక్కర్ బాటిళ్ల మీద రేట్లు పెంచారని…భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని… కరెంట్, బస్సు ఇలా అన్ని ఛార్జీలు పెంచుతున్నారని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాదకి 25 వేల కోట్ల రూపాయలను ప్రజల మీద మోపారని విమర్శించారు.
ఇక్కడ పరిపాలన చేతకాక … నేను ఏదో వెలగబెడతా అని బెంగాల్ పోతా, పంజాబ్ పోతా, కర్ణాటక పోతా అని చెబుతున్నారని.. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఇక్కడ పరిపాలించే సత్తా లేదు, సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశాన్ని వెలగబెడతా అని పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.